రూ.1080 కోట్లతో 21,220 కి.మీ మేర గుంతల రహిత రోడ్లు..

ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యం..

నాబార్డు నిధులతో రూ.1149 కోట్ల వ్యయంతో కొత్తరోడ్లు చేపట్టనున్నాం..

రూ.33 కోట్లతో 23,521 కి.మీ మేర జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాం..

రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి. సి. జనార్ధనరెడ్డి.

ఏలూరు
జనవరి,27:
రాష్ట్రంలో గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రూ. 1080 కోట్లతో 21,220 కి.మీ మేర పనులు చేపట్టి ఇప్పటికే 12,724 కి.మీ మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి. సి. జనార్ధనరెడ్డి వెల్లడించారు.
 సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా స్ధానిక రెవిన్యూ అతిధి గృహంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని రాష్ట్ర, జిల్లాలో రోడ్ల అభివృద్ధి పనులు ప్రగతిని వివరించారు.
 సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకరరావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి బి.సి. జనార్ధనరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో రూ. 1080 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టామన్నారు.
 వీటిలో ఇప్పటికే 65 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.
 రోడ్ల మరమ్మత్తులను వేగంగా పూర్తిచేసే క్రమంలో నాణ్యత విషయంలో రాజీలేకుండా రోడ్ల నాణ్యతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేయనున్నామన్నారు.
 ఎక్కడైనా నాణ్యత ప్రామాణాలు లోపిస్తే అధికారులపై కూడా చర్యలుతీసుకుంటామన్నారు.
2014-19 మధ్య రహదారుల కొరకు ఆనాటి టిడిపి ప్రభుత్వ హయాంలో రూ. 11 వేల 468 కోట్లు ఖర్చుచేశామన్నారు.
 అయితే గత ప్రభుత్వం రూ. 16 వేల 852కోట్లు కేటాయించి కేవలం 7వేల 334 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.  అందులో మళ్లి తిరిగి రూ. 2,300 కోట్లు బకాయిలు పెట్టారన్నారు.
దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 180 రోజుల్లోనే రూ. 1066 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు.
 రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ హెచ్ ఎ1, మోర్త ద్వారా మొత్తం 133 ప్రాజెక్ట్ ల్లో రూ. 77 వేల 967 కోట్లతో 3,463 కి.మీ మేర జాతీయ రహదారి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
 మరమ్మతులు చేయలేని స్ధితిలో ఉన్న రోడ్ల స్ధానంలో గౌ. ముఖ్యమంత్రి వారి సూచన మేరకు రూ. 1149 కోట్ల వ్యయంతో కొత్త రోడ్లను నాబార్డు నిధులతో చేపట్టనున్నట్లు మంత్రి జనార్ధనరెడ్డి వెల్లడించారు.
రోడ్లపై ముళ్లకంపలను తొలగించి రూ. 33 కోట్ల వ్యయంతో 23 వేల 521 కి.మీ మేర జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టామన్నారు.
 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, వంటి ప్రక్క రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ రోడ్లను స్టడీచేసే పరిస్ధితి ఉందన్నారు.
నాడు పక్క రాష్ట్రాలకు మనరోడ్లు మోడల్ గా నిలిస్తే నేడు రాష్ట్రంలో రోడ్లు అవహేళన చేసేలా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దిగజార్చిందన్నారు.  గతంలో కె.టి.ఆర్. రాష్ట్రంలో రోడ్ల దుస్ధితి గురించి చేసిన విమర్శలు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు.
 గతంలో ఎంతో గొప్పగా బ్రతికే ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడే దుస్ధితికి తీసుకువచ్చారన్నారు.
  రాష్ట్రంలో మొత్తం 12 వేల 653 రాష్ట్ర హైవేలు ఉండగా వీటిలో 10 వేల 200 కి.మీ మేర పిపిపి పద్దతిలో నిర్మాణం చేపట్టే ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 2019 ఫిబ్రవరి లో ఎన్ డి బి ద్వారా జిల్లా, మండల కేంద్రాల రోడ్ల అనుసంధానం కోసం ఫేజ్-1 కింద రూ. 3014 కోట్లతో చేపట్టిన 1244 కి.మీ రోడ్లు మరియు 2 బ్రిడ్జిలనిర్మాణం పనుల్లో 26 శాతం పనులు పూర్తిచేయడం, నేడు కాంట్రాక్టర్లకు భరోసా కల్పించి గతంలో ఆగిన పనులను మొదలు పెట్టడం జరిగిందన్నారు.
ఏలూరు జిల్లాలో రూ. 98 కోట్ల తో 174 రోడ్ల మరమ్మతు పనులను చేపట్టడం జరిగిందన్నారు.
ఇవి కాక వరదల్లో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పెదవాగు ప్రాజెక్ట్ నుండి వరద నీటి మూలంగా పోయిన రహదారులు మరమ్మతులకు నూజివీడులో పెద్దచెరువు గండి వలన పాడైన రహదారి మరమ్మతులకు రూ. 4 కోట్లు మంజూరు చేశామన్నారు.
 సిఆర్ఎఫ్ నిధుల కింద రూ. 43.05 కోట్ల తో రెండు పనులు జరుగుతున్నాయన్నారు.  షెడ్యూల్ ట్రైబ్ కాంపోనేట్ కింద రూ. 34.50 కోట్లతో బూర్గంపాడు- అశ్వారావుపేట రహదారి పనులు సాగుతున్నాయన్నారు.
 ప్రధాన రహదార్ల మరమ్మతుల కింద ఏలూరు-మేడిశెట్టివారిపాలెం, సిద్ధాంతం-పెదఎడ్లగాడి, భీమవరం-గుడివాడ మూడు ప్రధాన రహదారి పనులు జరుగుచున్నాయన్నారు.
 గౌ. ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు రూ. 15 కోట్లతో ఏలూరు శనివారపుపేట వద్ద బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించి ఆమోదం పొందే దిశలో ఉన్నాయన్నారు.
 నూజివీడు బైపాస్ కొరకు భూసేకరణ జరుగుచున్నదని, బైపాస్ నిర్మాణం కొరకు రూ. 25 కోట్లు మంజూరు చేశామన్నారు.
రైల్వే ఎల్ సి నెం351 వద్ద ఆర్ఓబి నిర్మాణానికి రూ. 40 కోట్లతో పరిపాలన మంజూరి దశలో ఉందన్నారు.
 రాష్ట్రం, జిల్లాలో చేపట్టిన గుంతల రహిత రహదారుల నిర్మాణాలను ఫిబ్రవరి నాటికి పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ జి. జాన్ మోషే ,ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, తహశీల్దారు జి.వి. శేషగిరి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *