అర్జీలు పునరావృతం కారాదు..

అర్జీలకు నాణ్యమైన స్పష్టమైన పరిష్కారం చూపాలి

పరిష్కార తీరు అర్థవంతంగా వుండాలి..

జిల్లాకలెక్టర్ కె. వెట్రిసెల్వి….

ఏలూరు,సెప్టెంబర్ 30:ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్’
లో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా  కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ డి. పుష్పమణి, ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, డిఆర్డిఏ పిడి ఆర్.  విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భాస్కరరావు, యం.ముక్కంటిలతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్జీల
పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత
కాలవ్యవధిలో నాణ్యమైన పరిష్కారంచూపాలన్నారు.
అర్జీదారుల నుంచి స్వీకరించే వినతులపై తక్షణ పరిష్కారానికి అధికారులు చిత్తశుధ్ధితో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.  ప్రతి అర్జీదారు సంతృప్తిచెందేలా పరిష్కారం ఉండాలని అసంతృప్తితో అర్జీలు రీ ఓపెన్  కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
 దివ్యాంగుల వద్దకే కలెక్టర్
పీజీఆర్ఎస్ వేదిక వద్దకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులను కిందనే ప్రత్యేకంగా వీల్ చైర్ లో కూర్చోబెట్టి వారి వద్దకే కలెక్టర్ వచ్చి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. దివ్యాంగులమని నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక సహాయ, గుర్తింపును, చేయూతను అందిస్తోందన్నారు.
అందిన అర్జీలలో కొన్ని…
తంగెళ్లమూడికి చెందిన చొదిమెళ్ల బాలకృష్ణ తమ ఇంటిస్ధలం ఆక్రమణకు గురౌతుందని ఆ స్ధలానికి సరిహద్దులు నిర్ణయించి ఆక్రమణను తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు.  పెదపాడు మండలం కలపర్రు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఫిషర్ మేనే సొసైటీని రద్దుపరచి రెవిన్యూ అధికారి వారిచే దర్యాఫ్తు చేయించి చెరువును కాపాడవల్సిందిగా అర్జీని అందజేశారు.  వంగూరు గ్రామానికి చెందిన చలసాని వెంకట సంపత్ కుమార్ తమ కుమారునికి తాతగారు వీలునామ వ్రాసివున్న దానిప్రకారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్ లైన్ చేయించవల్సిందిగా అర్జీ అందజేశారు.  చింతలపూడి మండలం తీగలవంచ కు చెందిన వెంకటేశ్వరరావు తమ భూమిని ఆన్ లైన్ మరియు అడంగళ్ నందు నమోదు చేయాలని అర్జీ అందజేశారు.  అదే విధంగా హౌసింగ్, ఫీజు రియింబర్స్ మెంట్, పోలీస్ కేసులు, భూమి తగాదాలు, తదితర సమస్యల పై అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ ఏవో నాంచారయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *