జిల్లాలో అర్డిఓలుగా పనిచేసి బదిలీపై వెళుతున్న ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీశంకరి లకు ఆత్మీయ వీడ్కోలు …
హృదయానికి హత్తుకునేలా వారు విధులు నిర్వర్తిoచారు
నిబద్ధత, జవాబుదారీ తనంతో పనిచేస్తే ప్రతి ఉద్యోగికి మంచి గుర్తింపు…
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, సెప్టెంబరు, 30: నిబద్ధత, జవాబుదారీ తనంతో పనిచేస్తే ప్రతి ఉద్యోగికి మంచి గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు, నూజివీడు డివిజన్ల ఆర్డిఓలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీశంకరి లను సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డిఓలు తమ విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. అత్యంత సమర్ధవంతంగా ఎన్నికల నిర్వహణ, ఓర్పు, సహనం, పాజిటివ్ ధృక్పదంతో పనిచేశారని, అలాగే జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు, వరదల సమయంలో పునరావాస కార్యక్రమాల అమలులో విజయవాడ వరద బాధితులకు ఆహార ఏర్పాట్లలో ఇరువురు అధికారులు అంకిత భావం,సానుకూల దృక్పథంతో చిత్తశుద్ధితో పనిచేసి సమర్ధవంతమైన పనితీరు కనబరిచి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకువచ్చారని కలెక్టర్ వారిని అభినందించారు. మంచి అధికారులుగా ప్రజల నుంచి మెప్పు పొంది, ఐ ఎ ఎస్ అధికారులుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీశంకరి లు తమ విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, సమర్ధతలను అభినందించారు.
అనంతరం ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీశంకరి లను జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ దుశ్శాలువా, పుష్పగుచ్ఛాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీశంకరి లు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తమ విధి నిర్వహణలో ప్రోత్సాహాన్ని అందించారని వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ డి. పుష్పమణి, ఆర్డిఓ లు అచ్యుత అంబరీష్, కె. అద్దయ్య,వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.