శ్రీసత్యసాయి జిల్లా:-
ధర్మవరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. మంత్రి సత్యకుమార్ సమక్షంలో వైసీపీకి చెందిన మైనార్టీ నేత కృష్ణాపురం జమీర్ సోమవారం బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే జమీర్ చేరికను ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
క్రమంలోనే సోమవారం బీజేపీలో చేరికకు జమీర్ రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీలో చేరికపై ధర్మవరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అయితే జమీర్ బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులు ఈఫ్లెక్సీలను చించివేశారు. ఈ విషయమే టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఫ్లెక్సీల తొలగింపుపై తొలుత వాగ్వాదం చెలరేగగా.. ఆ తర్వాత ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో రెండు స్కార్పియో కార్లతో పాటుగా మూడు బైకులు ధ్వంసమయ్యాయి.
మరోవైపు ఘర్షణ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ధర్మవరం పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా షాపులను మూసివేయించారు.
మరోవైపు పొత్తుల్లో భాగంగా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను బీజేపీ దక్కించుకుంది. దీంతో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ నిరాశకు గురయ్యారు. అయితే అధిష్ఠానం ఆదేశాలతో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విజయానికి పరిటాల శ్రీరామ్ కృషి చేశారు. కూటమి పార్టీల సమన్వయంతో ఈ స్థానాన్ని కూటమి దక్కించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై స్వల్ప మెజారిటీ సత్యకుమార్ యాదవ్ గెలుపొంది.. మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ధర్మవరం నియోజకవర్గంలో పార్టీల బలోపేతంపై రెండు పార్టీలు దృష్టిసారించటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *