బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లపై రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మరియు కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని కేసులు బనాయించినారు. ఈ చర్యను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత వైసీపీ పాలన కంటే అధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు నమోదు అవుతున్నాయి. అధికారం లో వున్న పార్టీల ఎమ్మెల్యేలే స్వయంగా అట్రాసిటీలకు పాల్పడుతున్నారు.
ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు రఘురామకృష్ణరాజు డా.అంబేద్కర్ చిత్ర పటాన్ని తొలగించడం ద్వారా ఆయన ను అవమానించడం, కాకినాడ శాసన సభ్యులు పంతం నానాజీ దళిత డాక్టర్ పై దాడి చేయడంలాంటి సంఘటనలు చాలా ప్రమాదకరమైనవి.
ఇటువంటి సంఘటనలు జరుగకుండా అరికట్టవవలసిన ప్రభుత్వం నిరసన తెలియజేసే వారిపై కేసులు పెట్టడం సహించరాని విషయం. గత ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిన టీడిపి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే బాటలో నడవడం మంచి పద్ధతి కాదు.
కనుక, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తప్పు చేసిన శాసనసభ్యులపై చర్యలు తీసుకొని నిరసన తెలిపే వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు జరుగకుండా అరికట్ట వలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు టి వెంకటస్వామి.