బీసీలకు కుల గణన లేకపోవడం వలన బీసీల వాటాను ఓసీలు అక్రమంగా ఆక్రమించు కొంటున్నారు: అంపావతిని గోవిందు.

9.10.2024 బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలో ధర్నాచౌక్ (అలంకార్ సెంటర్) వద్ద బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు “బీసీల కుల జనగణన” చేయాలని జరుపు “మహాధర్నా” ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాము. బీసీలకు కుల గణన లేకపోవడం వలన వారి జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిన వాటి అన్నింటిలోను వారి వాటా వారికి దక్కకుండా ఓసీలే అక్రమంగా ఆక్రమించు కొంటున్నారు.
నిజానికి విద్య-ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు తదితర వాటిల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం దక్కాల్సి ఉంది. అలాగే బడ్జెట్ లో నిధులు కూడా ఈ మేరకు ఖర్చు చేయాల్సి ఉంది. కాని ఆ మేరకు దక్కలేదు. ఇది కేవలం ఈ దేశంలో ఒక బీసీలకు మాత్రమే ఇలా జరుగుతావుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటా వారికి ఇవ్వాలని రాజ్యాంగంలో రాశారు. ఈ విధంగానే బీసీలకు కూడా ఆర్టికల్ 340 ద్వారా వచ్చే ప్రభుత్వాలు వారి వాటా వారికి ఇవ్వాలని రాజ్యాంగంలో రాసినప్పటికీ ఈ కుల, మత, దోపిడి, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీల ప్రభుత్వాలు ఇంత వరకు పట్టించుకోలేదు. ఇక ఓసీల జనాభా ఎంత ఉన్నదో తెలియదు. కాని వారు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని తమ జనాభాకు మించిన రిజర్వేషన్లను ఇ.డబ్ల్యూ.ఎస్. పేరుతో 10 శాతం విద్య, ఉద్యోగాల్లో పొందుతున్నారు. ఇక చట్టసభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులను సైతం మొత్తం ఆక్రమించుకున్న విషయం మన అందరికి తెలిసిందే.
న్యాయస్థానాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో మురళీధర్ రావు కమీషన్ సిఫారసుల మేరకు 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 44శాతం రిజర్వేషన్ కల్పించేందుకు జీ.ఓ. ఇచ్చినప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కొంతమంది బీసీ పెద్దలు న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు బీసీలకు అధికారికంగా జనాభా లెక్కలు ఉంటే మీ వాటా మీరు తీసుకోవచ్చని తీర్పులు వెల్లడించాయి.
అందువలన బీసీలకు 78ఏళ్లుగా జనాభా లెక్కలు లేకపోవడం వలన అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోవడం జరుగుతావుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒక ఉదా:- ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు ఉంటే అందులో ఎస్సీలకు జనాభా లెక్కలు ఉండడం వలన వారి వాటాకు రెండు సీట్లు వచ్చాయి. అదే విధంగా బీసీలకు జనాభా లెక్కలు ఉండి ఉంటే 8 ఎమ్మెల్యే సీట్లు లభించాల్సి ఉంది. ఇదే జిల్లాలో కమ్మ కులస్తుల జనాభా ఒక శాతం కూడా లేదు. వీరికి ఇవ్వాల్సి వస్తే ఒకటి లేదా ఒకటి కూడా ఇవ్వకూడదు. కాని టిడిపి అధికారంలో ఉన్న ప్రతి సారి 5 లేక 6 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉండడం జరుగుతావుంది. ఇదే విధంగా రెడ్ల జనాభా కూడా 3 లేక 4 శాతం ఉంది. వీరికి ఇవ్వాల్సి వస్తె 1 లేక 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సి ఉంది. కాని కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ప్రతి సారి 9 లేక 10 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. నిజానికి కమ్మ, రెడ్ల జనాభా దామాషా ప్రకారం వారికి దక్కాల్సినవి పోగా మిగిలినవి అన్ని సీట్లు బీసీలవే.
ఈ విధంగా బీసీలను అడుగడుగునా ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మ, రెడ్ల పార్టీలైన టిడిపి, వైఎస్ఆర్సీపీలు వేల మట్లు పాతాళంలోకి తొక్కుతున్నాయి. పైగా కుల జనగణనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక బీసీలు ఇంత పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో నష్టపోతున్నారన్న విషయాన్ని “బహుజన్ సమాజ్ పార్టీ” జాతీయ అధ్యక్షురాలు గౌరవ మేడమ్ మాయావతి గారు గ్రహించి బీసీల జనాభా లెక్కలు మీరు (అగ్రకుల పార్టీలు) లెక్కిస్తారా? లెక్కించండి లేదా మేము అధికారంలోకి వస్తాము బీసీల జనాభాను లెక్కించి వారి వాటాను వారికి వచ్చే విధంగా చేస్తామని ప్రకటించడం జరిగింది.
ఈ మేరకు రాష్ట్ర బీఎస్పీ నాయకత్వం “బీసీల కుల జనగణన” చేయాలని 9.10.2024 బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలో “ధర్నాచౌక్” (అలంకార్ సెంటర్) వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నది. దీనిని బీసీలు అందరూ సదవకాశంగా తీసుకొని ధర్నా కార్యక్రమానికి లక్షల సంఖ్యలో హాజరై “బీసీల కుల జనగణన” సాధించుకోవడానికి బీసీలు అందరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *