జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా మండల స్థాయి పరీక్ష. ప్రకాశం జిల్లా గిద్దలూరు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు డాక్టర్ భూమా బాల నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సైన్సు సత్యానికి ప్రతిరూపమని, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, సంస్కరణ వాదాన్ని, శాస్త్రీయ పరిశీలన పెంపొందించడం ప్రతి పౌరుని విధి అని చెప్పిన భారత రాజ్యాంగము ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కన్నా విశిష్టమైనది అన్నారు.

డాక్టర్ జె వి నారాయణ మాట్లాడుతూ విద్యార్థులను చెకుముకి సైన్స్ సంబరాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, పాఠశాల యాజమాన్యాలను, ఉపాధ్యాయులను అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులలో సృజనాత్మకత, ఊహాశక్తిని పెంచేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

డాక్టర్ జి.కె.మోహన్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి చెందే కొద్దీ మూఢనమ్మకాలు, అందవిశ్వాసాలు పటాపంచలై శాస్త్రీయ భావాలు ప్రజల్లో ఏర్పడతాయని, సైన్స్ తగ్గిపోయే కొద్ది చాందస భావాలు ప్రబులుతాయని, హతువాదము కనుమరుగు అవుతుందని, మానవత్వము మట్టి పాలవుతుందన్నారు.

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పి స్వరూప రెడ్డి మాట్లాడుతూ ఆది కాలము నుండి ఆధునిక కాలం వరకు, వానరం నుండి నరుని వరకు, రాతి యుగము నుండి రాకెట్ యుగం వరకు, పూరి గుడిసె వాసి నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు జరుగుతున్న పరిణామములో శాస్త్రము, శాస్త్రీయత, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ ఆలోచన ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్నారు. అందుకోసమే విద్యార్థులు శాస్త్రీయతకు హాయ్ చెప్పాలని, సూడో సైన్స్ కు నో చెప్పాలని, సైన్స్ సై చెప్పాలని, శాస్త్రీయ ప్రచార ఉద్యమానికి జై కొట్టాలని, దేశం కోసం సైన్స్ అని నినదించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో మూఢనమ్మకాల పట్ల అవగాహన కల్పించి వాటిని నిర్మూలించేందుకు, సైన్స్ పట్ల ఆశక్తిని, ప్రశ్నించే తత్వాన్ని
పెంపొందించేందుకు, విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను తీసేందుకు జన విజ్ఞాన వేదిక గత 36 సంవత్సరాలుగా కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక గిద్దలూరు డివిజన్ అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించి చెకుముకి సంబరాలలో పాల్గొన్న 21 టీమ్ ల ఫలితాలను ప్రకటించారు. అతిధుల మధ్య చెకుముకి మండల స్థాయి ప్రశ్నాపత్రాల విడుదల జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి అనురాధ ,కంటి వైద్యులు జి సుదర్శన్ రెడ్డి, కరస్పాండెంట్ పివి తిరుపతిరెడ్డి, ప్రవేట్ పాఠశాలల సంఘం నాయకులు కె. రామిరెడ్డి, జన విజ్ఞాన వేదిక నాయకులు డి.జి.బ్రహ్మానంద రెడ్డి, కొండేటి రాజా, వివిధ పాఠశాలల ప్రతినిధులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.
మండల స్థాయి చెకుముకి సైన్ సంబరాలలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధమ, ద్వితీయస్థానాలను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కైవసం చేసుకుంది. తృతీయ స్థానాన్ని జిల్లా పరిషత్ పాఠశాల, కృష్ణం శెట్టి పల్లె కైవసం చేసుకుంది.
ప్రైవేటు పాఠశాలల్లో ప్రధమ తృతీయ స్థానాలను సూర్య విద్యా నికేతన్ గెలుపొందగా, ద్వితీయ స్థానాన్ని అరుణోదయ స్కూల్ కైవసం చేసుకుంది.
జిల్లాస్థాయి పరీక్షకు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల టీం, సూర్య విద్యా నికేతన్ టీం ఎన్నికైనట్లు పరీక్ష నిర్వాహకులు డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. విద్యార్థులకు ప్రశంశాపత్రాలు, మెమెంటోలు, బహుమతుల రూపంలో పుస్తకాలు, ప్యాడ్స్, పెన్నులు అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *